అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్న హయత్ నగర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇతర డివిజన్లలాగే హయత్ నగర్ కూడా అభివృద్ధి అంటే ఏమిటో తెలియకుండా ఉంది. అధ్వాన్నమైన రోడ్లే చాలా ప్రాంతాల్లో కనిపిస్తాయి. డ్రయినేజీ వ్యవస్థ మరీ అధ్వాన్నం. ఆదర్శ హయత్ నగర్ గా తీర్చి దిద్దాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. వాస్తవ పరిస్థితుల ఆధారంగా పక్కా ప్లాన్ తో డివిజన్ ను అభివృద్ధి చేస్తానంటున్నారు బిజెపి అభ్యర్థి కళ్లెం నవజీవన్ రెడ్డి.

 

హయత్ నగర్ డివిజన్ లో పలు కాలనీలున్నాయి. శాంతివనం కాలనీ, శుభోదయ నగర్ కాలనీ, సుభద్రా నగర్, కమలానగర్, హుడా సాయినగర్, సుష్మా సాయినగర్ తదితర కాలనీల్లోని ప్రజలకు తగిన మౌలిక సదుపాయాలు లేవు. పేరుకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నా మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్టే పలు చోట్ల రోడ్లు దరిద్రంగా ఉన్నాయి. హైవేకు అటువైపు సువిశాలమైన జింకల పార్కు, ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తాయి. అంతటి ఆహ్లాదకరమైన హరిణ వనస్థలి హయత్ నగర్ డివిజన్ లో భాగం కాదు. అది వేరే డివిజన్  పరిధిలో ఉంది. హయత్ నగర్ ప్రజలు ప్రకృతిఒడిలో సేద దీరాలంటే హరిణ వనస్థలి ప్రాంతంలోని పచ్చదనం చూసి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందాల్సిందే. హయత్ నగర్ డివిజన్ లో పార్కుల జాడేలేదు. ఒక్క హుడా సాయినగర్ లో మాత్రం ఒక పార్కు ఉంది. దీని నిర్వహణ కూడా అంత గొప్పగా లేదు. మిగతా కాలనీల్లో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వాకింగ్ చెయ్యడానికి పచ్చని చెట్లతో కూడిన పార్కులు అవసరం. అలాగే ప్లే గ్రౌండ్ కూడా యువతకు అవసరం. ఇవేవీ ప్రస్తుతం లేకపోవడం పెద్దలోటు.

 

విజయవాడ హైవే మీదుగా హైదరాబాద్ కు వచ్చే వారు మొదట హయత్ నగర్ డివిజన్ లో ప్రవేశిస్తారు. అంటే గ్రేటర్ నగరానికి ఇది సింహద్వారం లాంటిది. కానీ ఈ ప్రాంతంలో ప్రవేశించగానే అభివృద్ధి చెందిన నగర డివిజన్ లోకి వచ్చిన ఫీల్ కలగదు. మరి ఇంత కాలం ఇక్కడ కార్పొరేటర్లుగా, ఎల్ బి నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లు ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదర్శ హయత్ నగర్ విజన్ ఇప్పుడు డివిజన్ ప్రజలను ఆకట్టుకుంటున్నది. ప్రజలకు ఏదో చేయాలనే తపన ఉన్న అభ్యర్థిగా ఆయన ప్రజల్లో గుర్తింపు పొందారు. కాబట్టి ఆయన్ని కార్పొరేటర్ గా గెలిపిస్తే హయత్ నగర్ ఆదర్శ డివిజన్ అవుతుందని ప్రజలు చాలా మంది చెప్తున్నారు.